
మోహన్ బాబు తనయుడు, యువ కథానాయకుడు మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరుతో చాలాసేపు ముచ్చటించానని చెబుతూ చిరుతో తీసుకున్న సెల్ఫీ పిక్ షేర్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది.

ఆ ఫొటోను ట్విటర్లో అభిమానులతో పంచుకున్న ఆయన మెగాస్టార్‌ని ఎందుకు కలిశాను తర్వాత చెబుతానని తెలిపారు. ‘ఈ రోజు బిగ్‌బాస్‌ను కలిశాను. ఎందుకు కలిశాననేది త్వరలో వెల్లడిస్తాను. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు ఎన్నో ప్రశ్నలు సంధించి.. సమాధానం రాబట్టుకునే గొప్ప అవకాశం నాకు దక్కింది. ఆ సమాధానాలతో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆయన మెగాస్టార్ ఎందుకయ్యారో.. అనే విషయంలో అస్సలు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు.’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు.
అయితే మంచు విష్ణు.. చిరంజీవిని ఎందుకు కలిశారన్న దానిపై టాలీవుడ్లో ఊహాగానాలు మొదలయ్యాయి. విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌కు చిరును ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే కలిశారని కొందరు, చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌లో మంచు విష్ణు కీలక పాత్రలో ఉందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి కలయికకు కారణమేంటో ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
